Bharath Darpan
Date of Publish : 31/10/2026, 5:38 pm
Published by T Ramanjaneyulu

రామ్మూర్తి మాస్టారు రివ్యూ: ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చాటే అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ

ప్రతి మాస్టారు , ప్రతి మాస్టారి భార్య మరియు కుటుంబ సభ్యులు చూడవలసిన చిన్న సినిమా . గురువుల ఔన్నత్యాన్ని గురించి శ్లాఘించే సినిమాలు చాలానే ఉన్నాయి . మహానటుడు యన్టీఆర్ నటించిన బడిపంతులు సినిమాయే ముందుగా గుర్తుకొస్తుంది నాకు .

ఆ సినిమా తర్వాత నాకు బాగా నచ్చింది ఈ రామ్మూర్తి మాస్టారు అనే చిన్న సినిమా . చక్కటి feel good short movies ని అందిస్తున్న ఈటివి Win వారిని తప్పక అభినందించాలి . మానసిక కాలుష్యాన్ని బాగా తగ్గిస్తున్నారు చక్కటి చిన్న చిన్న feel good సినిమాలతో .

రామ్మూర్తి మాస్టారు త్రికరణశుధ్ధిగా పనిచేసే ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారు . ఆయన స్కూల్ , స్కూల్లో విద్యార్థులు ఆయన లోకం . ఆయన భార్యకు మాత్రం వాళ్ళాయన ట్యూషన్లు చెప్పకుండా , కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పకుండా ఎడాపెడా సంపాదించటం లేదని గుర్రు . మాస్టారి రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆయన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం కలెక్టర్లు , SP లు అయి ఆ ఫంక్షన్లో తమ మాస్టారి ఔన్నత్యం గురించి చెపుతుంటే మాస్టారి గారి సతీమణి హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది .

రామ్మూర్తి మాస్టారిగా తనికెళ్ల భరణి చాలా matured నటనను అందించారు . మాస్టర్లకు ఉండవలసిన సత్వ గుణాన్ని అద్భుతంగా చూపారు . ఆయన అసంతృప్త భార్యగా సుహాసిని బాగా నటించారు . రాఘవేంద్రరావు నిర్మాత . గంగనమోని శేఖర్ దర్శకుడు . శ్రావ్యమైన సంగీతాన్ని , ఢాంఢాంలు లేని BGM ని అందించారు సాయి మధుకర్ . డైలాగులు చక్కగా వినిపించాయి .

 ప్రభుత్వం వారు ఈ సినిమాను అన్ని కళాశాలల్లో , పాఠశాలల్లో మాస్టర్లందరికీ చూపాలని నా విన్నపం . ఈ సినిమాను చూడనివారు తప్పక చూడండి . నింపాదిగా నడుస్తుంది . మలుపులు , కేకలు , ఢాంఢాంలు ఏం ఉండవు . అలా అలా ప్రశాంతంగా సాగుతుంది .

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights reserved by Bharath Darpan.
PDF Share Save