Bharath Darpan
Date of Publish : 25/10/2026, 6:48 pm
Published by T Ramanjaneyulu

Vizianagaram: జడ్పీ పీఠం.. మామా-అల్లుళ్ల సమరం

  • బొత్స వర్సెస్ చిన్న శ్రీను: నిన్నటి వరకు ఒకే గూడు.. నేడు ప్రత్యర్థి శిబిరాలు! విజయనగరం జడ్పీ చైర్మన్ సీటు ఎవరిది?
  • అనూష VS సిరి సహస్ర: వారసత్వ పోరులో నెగ్గేది బొత్స కుమార్తెనా? లేక కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్న శ్రీను కూతురా?

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఉత్తరాంధ్రలో ఊహించని రాజకీయ సంక్షోభం ఎదురవుతోంది. వైఎస్సార్‌సీపీకి చెందిన ద్వితీయ శ్రేణి, స్థానిక నాయకులు కొందరు బహిరంగంగానే, మరికొందరు తెరవెనుక లోపాయికారీ ఒప్పందాలతో అధికార కూటమి నేతలతో రాజీ పడిపోతున్నారు. అధికారం కోల్పోవడం, మరోవైపు కేసులు, విచారణల భయంతో తమ ఉనికిని, వ్యాపారాలను కాపాడుకునేందుకు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్థానికంగా పదవులు, వార్డులను సర్దుబాటు చేసుకుంటున్నారు.

ఉత్తరాంధ్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కోసం ఉత్కంఠభరిత పోరు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ ఒకే గూటి కింద అధికారం చెలాయించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుల మధ్య పోటీ ఇప్పుడు ప్రత్యక్ష పోరుగా మారిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జడ్పీ చైర్మన్ పదవి ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో.. బొత్స సత్యనారాయణ తన వారసురాలిగా కుమార్తె డాక్టర్ బొత్స అనూషను జడ్పీటీసీ బరిలోకి దించగా, వైఎస్సార్‌సీపీని వీడి ఇటీవల టీడీపీ కండువా కప్పుకున్న చిన్న శీను తన కుమార్తె మజ్జి సిరి సహస్రను (సిరమ్మ)ను కూటమి అభ్యర్థిగా రేసులో నిలిపారు. దీంతో విజయనగరం జడ్పీ ఎన్నిక మజ్జి వర్సెస్ బొత్స మధ్య సవాలుగా మారింది.

ఒకప్పుడు బొత్సకు అండగా పనిచేసిన చిన్న శ్రీను.. ఇప్పుడు కూటమి శిబిరంలో ఉండటం ఈ పోరుకు మరింత రాజకీయ ప్రాధాన్యం తీసుకొచ్చింది.

స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం ఒక ఎత్తయితే.. వారిని చివరి వరకు నిలబెట్టి గెలుపు కోసం పనిచేయించడం మరో ఎత్తు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న నాయకులు.. అధికారం మారిన తర్వాత తమ రాజకీయ భవిష్యత్తుపై కొత్తగా ఆలోచిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పోటీ తగ్గడం, అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి, స్థానిక స్థాయిలో ప్రత్యర్థులతో అవగాహనకు ప్రయత్నాలు.. ఇవన్నీ నిజంగా చోటుచేసుకుంటే వైసీపీకి సంస్థాగతంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు.

ఈ రాజకీయ సమరంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పూర్తిగా ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉండటం బొత్స వర్గానికి పెద్ద ప్రతికూల అంశంగా మారింది. పైగా, జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన బొత్స సోదరుడి కుమారుడు నామినేషన్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా తిరస్కరణకు గురికావడం బొత్స కుటుంబానికి కోలుకోలేని షాక్‌గా పరిణమించింది. జిల్లాపై దశాబ్దాలుగా ఉన్న పట్టును కాపాడుకునేందుకు బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూషను గెలిపించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

ఒకప్పుడు విజయనగరం జడ్పీ పీఠాన్ని దక్కించుకోవడంలో బొత్సకు సైన్యంగా పనిచేసిన చిన్న శీనే.. ఇప్పుడు అదే పీఠంపై తన కుమార్తెను కూర్చోబెట్టేందుకు బొత్సకు వ్యతిరేకంగా వ్యూహాలు రచించడం ఇక్కడి విశేషం. స్థానికంగా సొంత క్యాడర్ మద్దతుతో పాటు అధికార టీడీపీ నేతల పక్కా వ్యూహాలు, ఆర్థిక-అంగ బలాలు చిన్న శీను కూతురు సిరి సహస్ర వైపు మొగ్గు చూపుతుండగా, బొత్స అనూష విజయం కోసం బొత్స కుటుంబం ప్రతిష్టాత్మక పోరాటం చేస్తోంది. మొత్తానికి, మామా-అల్లుళ్ల రాజకీయ వైరం విజయనగరం జిల్లా స్థానిక పోరును రాష్ట్రస్థాయిలోనే అత్యంత ఆసక్తికరమైన సమరంగా మార్చివేసింది.

బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు తమ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. ఇతర జిల్లాల్లోనూ స్థానిక నాయకత్వాన్ని చురుకుగా ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే వైసీపీ నేతలు కూటమితో సర్దుబాటు చేసుకుంటున్నారన్న వార్తలు పార్టీలో నేతల మానసిక స్థితికి అద్దం పడుతోందని అంటున్నారు.

మొత్తంగా ఉత్తరాంధ్రలో స్థానిక ఎన్నికల పోరు కొత్త రాజకీయ సమీకరణాలకు వేదికగా మారుతోంది. విజయనగరం జడ్పీ చైర్మన్ పీఠం కోసం బొత్స అనూష, మజ్జి సిరి సహస్ర మధ్య పోటీ.. ఇప్పుడు విజయనగరంలో ఆసక్తి రేపుతోంది. ఎక్కువ మంది సిరివైపే మొగ్గుచూపుతున్నారని టాక్.

స్థానిక ఎన్నికల ఫలితాలే ఉత్తరాంధ్రలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో తేల్చనున్నాయి. బొత్స తన రాజకీయ పట్టును నిలబెట్టుకుంటారా? చిన్న శ్రీను తన కుమార్తెకు విజయాన్ని అందిస్తారా? వైసీపీ తన క్యాడర్‌ను తిరిగి ఏకం చేసుకోగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights reserved by Bharath Darpan.
PDF Share Save